పాక్‌ జట్టును ఆహ్వానించలేం: బంగ్లాదేశ్

తమదేశంలో పర్యటన నిర్వహించాల్సి ఉన్న పాకిస్థాన్ జట్టును ఇప్పట్లో ఆహ్వానించదల్చుకోలేదని బంగ్లాదేశ్ పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల దృష్ట్యా విదేశీ జట్లకు తగినంత రక్షణ కల్పించే స్థితిలో లేమని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పేర్కొంది.

ఈ విషయమై బంగ్లాదేశ్ క్రీడాశాఖ మంత్రి అహద్ అలీ సర్కార్ మాట్లాడుతూ అన్ని విదేశీ జట్ల పర్యటనలను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. తమ జాతీయ సెక్యూరిటీ విదేశీ ఆటగాళ్ల రక్షణ విషయంలో పూర్తి భరోసా ఇవ్వలేమని తేల్చి చెప్పిన కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కారణంగానే ఈ నెలలో బంగ్లాకు రావల్సిన పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. పాకిస్థాన్ జట్టు మార్చి 7నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌తో పాక్ ఐదు వన్డేలతో సహా రెండు ట్వంటీ-20లు ఆడాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి