పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్...!

టీం ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య స్నెడన్ పార్క్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్, మూడో రోజున ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

జహీర్ ఖాన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోగా.. ఆ తరువాత డేనియల్ ప్లిన్, మార్టిన్ గుప్తిల్‌లు రెండో వికెట్‌కు 48 పరుగులు జత చేశారు. అనంతరం హర్భజన్ సింగ్ గుప్తిల్‌ను పెవిలియన్‌కు పంపించగా, ఆ తరువాత వచ్చిన కైల్ మిల్స్ రెండు పరుగులకే మునాఫ్ పటేల్ బంతికి బలయ్యాడు.

దీంతో... భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే... కివీస్ 166 పరుగులతో ఇంకా వెనుకబడిపోయింది. అంతకుముందు జహీర్ ఖాన్ భారత ఉపఖండం వెలుపల తన తొలి అర్థ సెంచరీని (51 నాటౌట్) సాధించటం మూడో రోజు ఆట విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. కాగా, టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 520 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే..!

ఇదిలా ఉంటే... స్నెడన్ పార్క్ పిచ్ భారత బౌలర్లకు బాగా అనుకూలిస్తుండటంతో, నాలుగో రోజుకే (శనివారం నాటికే) విజయాన్ని కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే కివీస్‌తో జరిగిన ఐదువన్డేల సిరీస్‌ను టీం ఇండియా కైవసం చేసుకున్న సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి