ప్రసార హక్కులపై సోనీతో ఐపిఎల్ రాజీ..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ పోటీల ప్రసారం విషయంలో.. సోనీ టీవీకి ఐపీఎల్‌కు మధ్య ఏర్పడిన విభేదాలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా, ఐపీఎల్ టోర్నీ పోటీలను సోనీ టీవీయే ప్రసారం చేయనుంది.

ఈ మేరకు, ఐపీఎల్ 2009 ప్రసార హక్కులకు సంబంధించి తలెత్తిన ఈ వివాదాన్ని.. కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (పూర్వపు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

కాగా, ప్రసార హక్కులకు సంబంధించి ఐపీఎల్‌కు మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య 1.026 బిలియన్ అమెరికన్ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సోనీ తన కొత్త ఆఫర్‌ను బీసీసీఐకి ప్రతిపాదించి, కోర్టు వెలుపలనే వివాదం పరిష్కారానికి అంగీకరించాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... కొద్ది రోజుల క్రితం ఐపీఎల్ టోర్నీ ప్రసారాలకు సంబంధించి, ఐపీఎల్ నిర్వాహకులు ఇతర టెలివిజన్ ఛానెళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపిస్తూ, సోనీ టీవీ కోర్టుకెక్కిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి