బీసీసీఐ ధనబలమే కారణం : బక్నర్

వివాదాస్పద విండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ధనబలమే తనను పెర్త్ టెస్ట్ నుంచి తప్పించిందని వ్యాఖ్యానించాడు.

ఈ విషయమై బక్నర్ మాట్లాడుతూ... ఏ జట్టు కెప్టెన్‌కు అయినా అంపైర్‌పై అసంతృప్తి ఉన్నట్లయితే, అతడు నేతృత్వం వహించే బోర్డు పటిష్టంగా ఉంటే.. అలాంటి పరిస్థితుల్లో ఆ కెప్టెన్ ఏది చెబితే అదే చెల్లుతుందని ఆరోపించాడు. తన విషయంలోనూ అదే జరిగిందనీ, అందులో భాగంగానే... ధనబలం కలిగిన బీసీసీఐ గత సంవత్సరం జరిగిన సిడ్నీ తరువాత జరిగిన పెర్త్ టెస్ట్ నుంచి తప్పించిందని విమర్శించాడు.

62 సంవత్సరాల వయసుగలిగిన స్టీవ్ బక్నర్‌కు‌‌... అప్పటి టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లేతో వివాదాలు ఏర్పడటంతో... సిడ్నీలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కుంబ్లే బక్నర్‌కు వ్యతిరేకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. దీంతో కుంబ్లే ఫిర్యాదును స్వీకరించిన బీసీసీఐ స్టీవ్ బక్నర్‌ను ఆ తరువాత జరిగిన పెర్త్ టెస్ట్‌నుంచి తప్పించింది.

అప్పటి సంఘటనను గురించి స్టీవ్ బక్నర్ మాట్లాడుతూ... ప్రతి మనిషి జీవితంలోనూ మంచి, చెడు సమయాలను ఎదుర్కొంటుండటం సహజమని, తనకూ అలాగే జరిగిందని వాపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కూడా మంచి వ్యక్తులతో కలసి పనిచేశాననీ... అయితే వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవడం మాత్రం ఎవరికైనా బాధాకరంగా ఉంటుందని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి