హామిల్టన్‌లో ఆతిథ్య దేశంతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో మరో 150 పరుగులు సాధిస్తే, బలమైన స్థితిలో ఉంటామని సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
మరో 150 పరుగులు సాధిస్తే టీం ఇండియా మెరుగైన స్థితిలో ఉంటుందని, ఈ పిచ్‌పై పరుగులు సాధించడం అంత సులభం కాదని ద్రావిడ్ రెండో రోజు ఆటముగిసిన అనంతరం వ్యాఖ్యానించాడు. పిచ్ మిగిలిన రోజుల్లోనూ ఇలాగే ఉంటుందని పేర్కొన్నాడు. ఇకపై పరుగుల కోసం తొందరపడకుండా ఆడాల్సి ఉందన్నాడు.
ఇప్పటివరకు పరుగులపరంగా మేము మెరుగ్గానే ఆడామని ద్రావిడ్ చెప్పాడు. పరుగుల కోసం గురువారం బాగా శ్రమించాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు విసిరారు. ఇంకా మ్యాచ్‌లో చాలా సమయం ఉన్న కారణంగా, ఇప్పటివరకు మేము బాగానే ఆడామని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.
రెండో రోజు సెహ్వాగ్ (24) అవుట్ అవడంతో క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ (66) అర్ధ సెంచరీ సాధించాడు. ద్రావిడ్‌తోపాటు, ఓపెనర్ గంభీర్ (72), సచిన్ టెండూల్కర్ (70 నాటౌట్) కూడా అర్ధ సెంచరీలు సాధించి తొలి టెస్ట్‌లో భారత్‌ను మెరుగైన స్థితిలో ఉంచారు. ప్రస్తుతం సచిన్, యువరాజ్ సింగ్ (30) క్రీజ్‌లో ఉన్నారు.