మహిళల వరల్డ్‌కప్ : భారత్‌పై కివీస్ విజయం

సిడ్నీలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతూ... సూపర్ సిక్స్‌లో స్థానం సంపాదించిన టీం ఇండియాకు న్యూజిలాండ్ జట్టు పగ్గాలు వేసింది. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన సూపర్‌సిక్స్ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది.

టీం ఇండియా కెప్టెన్ జులన్ గోస్వామి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, 207 పరుగులు సాధించి, 49.4 ఓవర్లలో ఆలౌటయ్యింది. కాగా, వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమయిన తరువాత టీం ఇండియా ఆడిన లీగ్ మ్యాచ్‌లన్నింటిలోనూ 200 పరుగుల మార్కును దాటడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

బ్యాట్స్‌ఉమన్ అంజుమ్ చోప్రా 106 బంతుల్లో 52 పరుగులు, రీమా మల్హోత్రా 59 బంతుల్లో 52 పరుగులు చేసి టీం ఇండియా 207 పరుగుల స్కోరును సాధించటంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్ కటే పుల్‌ఫోర్డ్ 89 బంతుల్లో 71 పరుగులు సాధించి... కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే 210 పరుగులు చేసిన కివీస్ విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి