పదవి ఇస్తే పైలోకాల్నే చూపించాడట వెనకటికి ఒకరు. అచ్చం ఆ సామెత మాదిరిగానే ఉంది లలిత్ మోడీ వ్యవహారం. బీసీసీఐని బ్రతిమాలి ఐపీఎల్ క్రీడకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న లలిత్ మోడీ కొచ్చి ఫ్రాంఛైజీ వ్యవహారంలో ఓవరాక్షన్ ప్రదర్శించడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది.
ఈ నెల 26వ తేదీనాడు జరుగనున్న బీసీసీఐ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మోడీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తే... అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి తామే మోడీని తొలగిస్తున్నట్లు తీర్మానాన్ని సైతం చేయాలనుకుంటున్నట్లు భోగట్టా.
పంటికింద రాయిలా తయారైన మోడీని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ భరించే పరిస్థితి బీసీసీఐకి లేదని తెలుస్తోంది. లలిత్ మోడీ తీరు తమను తీవ్రంగా నిరాశపరిచిందని బీసీసీఐ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఆయన పదవి ఊడిపోయే సమయం ఇంకెంతో దూరంలో లేదని అనిపిస్తోంది.