రాయల్ ఛాలెంజర్స్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్రేక్..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు జోరుకు బ్రేక్ వేసిన ఢిల్లీ సేన 17 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
టాస్ గెలిచిన బెంగళూర్ ఛాలెంజర్స్ కెప్టెన్ అనిల్‌కుంబ్లే ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో కేదార్ జాదవ్ 50 నాటౌట్, డేవిడ్ వార్నర్ 33, డివిలియర్స్ 45 పరుగులతో రాణించటంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు సేన నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్మన్లలో మనీష్ పాండే 39, విరాట్ కోహ్లీ 38 నాటౌట్, కలిస్ 27 పరుగులు మాత్రమే సాధించటంతో అపజయం తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ ఓటమి తరువాత ఢిల్లీ తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్"ను కేదార్ దక్కించుకున్నాడు.