షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది

గురువారం, 19 మార్చి 2009 (09:48 IST)
ఐపీఎల్-2 టోర్నీ కొత్త షెడ్యూల్‌‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని ఐపీఎల్ ఛైర్మన్, కమిషనర్ లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ రెండో ఎడిషన్‌కు సంబంధించి తాము ప్రతిపాదించిన కొత్త షెడ్యూల్‌పై హోం మంత్రిత్వ ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు.

అంతకుముందు.. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఐపీఎల్-2 జరుగుతున్నందున భద్రతను పూర్తి స్థాయిలో కల్పించలేమని.. కనుక టోర్నీ షెడ్యూల్ వాయిదా వేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి పి చిదంబరం గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. అయితే ఈ షెడ్యూల్ ప్రతిపాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. మార్పు చేసిన షెడ్యూల్‌ను చిదంబరం అంగీకరించలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అనంతరం మళ్లీ కొత్త షెడ్యూల్‌ను చేయాల్సి వచ్చింది.

ఈ ప్రక్రియలో తయారైన ఈ కొత్త షెడ్యూల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని.. దానిని సమీక్షించిన అనంతరం చిదంబరం తుది నిర్ణయం ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి