అజంత మెండీస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

లాహోర్ తీవ్రవాద దాడిలో గాయపడిన శ్రీలంక క్రికెటర్లలో ఒకరైన అజంత మెండీస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు... ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వైద్య బృందం చీఫ్ గీతాంజన మెండిస్ వెల్లడించారు.

ఈ విషయమై గీతాంజన మీడియాతో మాట్లాడుతూ... గాయాల నుంచి పూర్తి కోలుకున్నందున మెండీస్‌ను డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. కాగా, పాక్‌లో జరిగిన తీవ్రవాదుల దాడిలో గ్రెనేడ్ శకలాల ఘాతానికి ఈ మిస్టరీ స్పిన్నర్ మెండీస్ తల, మెడకు, చెవి వెనుక భాగంలోనూ గాయాలైన సంగతి విదితమే.

అలాగే... ఎడమ తొడలో బుల్లెట్ గాయంతో ఆసుపత్రిలో చేరిన సమరవీరను ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచిన కారణంగా.. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్లు గీతాంజన పేర్కొన్నారు. ఇకపోతే... ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిన తరగం పరనవితన, ఇంగ్లండ్‌కు చెందిన అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్బ్రెస్‌లను ఆసుపత్రి నుంచి వారం రోజుల క్రితమే డిశ్చార్జి చేసినట్లు ఆమె వివరించారు.

వెబ్దునియా పై చదవండి