ఆఖరి వన్డే విజయం ఉత్ర్పేరకం లాంటింది: వెట్టోరి

ఆఖరి వన్డేలో లభించిన విజయం టెస్టులకు ఉత్ర్పేరకంగా ఉపయోగపడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ డేనియల్ వెట్టోరి అన్నారు. సొంతగడ్డపై భారత్‌తో జరిగిన ఐదు వన్డేలో కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను కివీస్ జట్టు 3-1 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం వెట్టోరి మాట్లాడుతూ చివరి వన్డేలో లభించిన విజయం మాకెంతో ఊరట కలిగించింది. ఈ సిరీస్‌ను 4-0 తేడాతో కోల్పోయి ఉంటే, ఈ ప్రభావం టెస్టులపై కూడా పడేది. ఈ విజయంతో మా కుర్రాళ్ళు ఆత్మవిశ్వాసంతో టెస్టులకు మానసికంగా సిద్ధమవుతారు. ముఖ్యంగా ఈ విజయం డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఇది టెస్ట్ సిరీస్‌కు ముందు ఎంతో మంచిదన్నారు.

అయితే, అసలు సిసలు పోరాటం ముందుంది. సచిన్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్.లక్ష్మణ్ వంటి సీనియర్‌లు భారత టెస్ట్ జట్టులో చేరారు. అందువల్ల మూడు టెస్ట్‌లు మాకో ఛాలెంజ్ వంటివే. అయితే, చివరి వన్డే జరిగిన ఈడెన్ పార్క్ మైదానంలో తొలుత టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మేం టాస్ గెలిచి ఉన్నట్టయితే తప్పకుండా బౌలింగ్ చేసి ఉండేవాళ్ళం అని వెట్టోరి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి