ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల కోసం తమ రాష్ట్రంలోని జైళ్లు ఎదురు చూస్తున్నాయని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. తాజాగా తమ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. రాహుల్, ఖర్గేల అస్సాం పర్యటనపై హిమంత స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు.
అటమీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్ గ్రహించలేకపోయారన్నారు. కానీ, కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని హిమంత అన్నారు. ఈ రకమైన ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారన్నారు. వారు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు.
ర్యాలీలో రాహుల్ గాంధీ, ఖర్గేలు చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రసంగాలతో హింసలను ప్రేరేపించినట్టు విచారణలో తేలితో రాహుల్, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇప్పటికే వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని హిమంత్ గుర్తుచేశారు.