జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో కొత్త కుర్రాడు మార్కస్ నార్త్, టెయిలెండర్ మిషెల్ జాన్సన్‌లు చెలగేరి ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 466 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేసింది. వీరిరువురూ.. ఎనిమిదో వికెట్‌కు 117 పరుగులు అనూహ్య భాగస్వామ్యం అందించి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు.
తన కెరీర్‌లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతున్న మార్కస్ నార్త్ 233 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులు సాధించాడు. మిషెల్ జాన్సన్ 131 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు సాధించి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, జాన్సన్ కెరీర్‌లో తొలిసారిగా సెంచరీని సాధించే అవకాశం తృటిలో చేజారిపోయింది.
శుక్రవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. నీల్ మెంకజీ 35, ఏబీ డివిలియర్స్ 13 పరుగులతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా కలిస్ టెస్ట్ మ్యాచ్‌లలో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంమీదా పదివేల పరుగులు సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నిలిచిన ఘనతను కూడా కలిసి సాధించాడు.