ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో నాలుగో నిందితుడుగా అరెస్టయిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయమూర్తి ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. దాదాపు ఏడు గంటల పాటు విచారణ జరిపిన తర్వాత శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆయనను ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచగా, ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు.
ఈ కేసులో మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించగా, సిట్ తరపున కోటేశ్వర రావు వాదనలు వినిపించారు. తాము కస్టడీ కోరుతున్నందున మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్‌కు పంపాలని సిట్ కోరింది. అయితే, మిథన్ రెడ్డి ఓ ఎంపీ అని, ఆయనకు వై కేటగిరీ భద్రత ఉందని, అందువల్ల నెల్లూరు జిల్లా జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించాలని నాగార్జున రెడ్డి కోరారు.
కాగా, మద్యం స్కామ్‌లోని ప్రధాన కుట్రదారుల్లో మిథున్ రెడ్డి ఒకరని, లిక్కర్ పాలసీ రూపకల్పన, షెల్ కంపెనీలకు ముడుపుల సరఫరా వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ స్కామ్ ద్వారా రూ.3200 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు సిటి ఆరోపిస్తోంది.