ఈడెన్‌ టెస్టుతో కెరీర్ మలుపు : లక్ష్మణ్

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో... ఆస్ట్రేలియాపై చేసిన 281 పరుగులే తన కెరీర్‌ను మలుపు తిప్పాయని, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించాడు.

క్లిష్ట సమయంలో తాను చేసిన డబుల్‌ సెంచరీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇ న్నింగ్స్ అని... ఆ టెస్టు జరిగి 9 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ఆ మధుర క్షణాలు తనకు గుర్తుకొస్తుంటాయని లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఫాలోఆన్‌ ఆడుతూ దాదాపు ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టుకు విజయం సాధించి పెట్టడం తానెప్పటికీ మరచిపోలేనన్నాడు.

న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ మీడియా ప్రతినిధులతో తన అనుభవాలు పంచుకుంటూ పై విధంగా స్పందించాడు. ఈడెన్ ఇన్నింగ్స్ తర్వాత తన ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగిందని, జట్టులో శాశ్వత స్థానాన్ని ఖాయం చేసిందని వివరించాడు.

ఇకపోతే... ద్రవిడ్‌తో కలిసి తాను నమోదు చేసిన భాగస్వామ్యం టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోతుందని లక్ష్మణ్ చెప్పాడు. కాగా, టెస్టు క్రికెట్‌లో వంద మ్యాచ్‌లను పూర్తి చేసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, తనలో సత్తా ఉన్నంత కాలం భారత జట్టుకు సేవలు అందిస్తాననీ ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి