ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్, 19.1 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఐపీఎల్-3లో రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సంగక్కర ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు మిచెల్ లుంబ్ 41, ఫజల్ 45 పరుగులతో ధీమాగా ఆడారు. ఆ తరువాత యూసుఫ్ 28, వోజెస్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలవటంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. పంజాబ్ బౌలర్లలో ఇర్ఫాన్ భారీగా పరుగులివ్వగా.. శ్రీశాంత్, చావ్లా ఒక్కో వికెట్ పడగొట్టారు.
తదనంతరం రాజస్థాన్ విధించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పంజాబ్ ఓపెనర్లు బొపారా, సంగక్కరలు కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన మన్విందర్ బిస్లా మెరుపు ఇన్నింగ్స్‌తో 9.3 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును అధిగమించి, వార్న్ సేన విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగానే అధిగమిస్తుందని అనిపించేలా చేసింది. అయితే యువరాజ్, బొపారా, ఇర్ఫాన్ వికెట్లను పడగొట్టిన రాజస్థాన్ బౌలర్లు పంజాబ్ విజయాన్ని కష్టతరం చేశారు.
ఈ దశలో కైఫ్‌తో సహా మిగిలిన బ్యాట్స్మెన్లు అవుట్ చేసేందుకు రాజస్థాన్‌కు పెద్దగా సమయం పట్టలేదు. ఈ క్రమంలో చివరి 7 వికెట్లను పంజాబ్ 45 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా.. మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగిన ఫజల్, వోజెస్లు 6.1 ఓవర్లలోనే చకచకా 60 పరుగులు సాధించడంతో పంజాబ్ 152 స్కోరు చేసినా ప్రయోజనం లేకపోయింది.