ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ సెమీఫైనల్ మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సెమీఫైనల్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్- బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ల మధ్య సమరం ఉంటుంది.
బెంగళూరులో జరగాల్సిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లను భద్రతా కారణాల దృష్ట్యా ముంబైకి మార్పు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో, పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సమరానికి "సై" అంటోంది.
బెంగళూరులో జరిగిన 52వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్కు ఒక గంటసేపు ముందు స్టేడియంలో జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో బెంగళూరులో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్లను ఐపీఎల్ యాజమాన్యం నవీ ముంబైకి తరలించింది.
దీనికితోడు ఐపీఎల్ మ్యాచ్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని సమాచారం అందడంతో, స్టేడియం ప్రాంతాలతో పాటు క్రికెటర్లకు భారీ బందోబస్తును కల్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగే తొలి ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ నిఘా నీడలో జరుగుతుందని సమాచారం. కాగా.. 22వ తేదీన జరిగే సెమీఫైనల్ రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్-డెక్కన్ ఛార్జర్స్లు పోటీపడుతాయి.
ఇకపోతే.. 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, అనిల్ కుంబ్లే సేనను మట్టికరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు 14 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ మ్యాచ్లో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు తహతహలాడుతోంది.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి.. సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్, బెంగళూరులలో ఏ జట్టు శుభారంభం చేస్తుందో..? వేచి చూడాల్సిందే..!