ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభ్యమైనట్లు ఐటీ శాఖాధికారులు తెలిపారు. ఈ పత్రాల ద్వారా ఐపీఎల్-కేకేఆర్-సీఏబీల మధ్య ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా డాక్యుమెంట్ల ఆధారంగా సమగ్ర దర్యాప్తును కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లోని కేకేఆర్ ఆఫీసు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం అర్థరాత్రికి తర్వాత ఒంటి గంటకు ఈ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఐపీఎల్-కేకేఆర్‌లు మధ్య గల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలను కైవసం చేసుకున్నట్లు ఐటీ అధికారి యాదవ్ తెలిపారు.
కాగా.. ఐపీఎల్ ప్రారంభమైన గత మూడేళ్లలో ఛైర్మన్ లలిత్ మోడీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. లలిత్ మోడీ గుట్టు రట్టు చేసేందుకు కీలక ఆధారాల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు దాడులు జరిపారు.