అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు చోటు దక్కనుంది. కాగా.. వివిధ రంగాలలో ప్రసిద్ధిచెందినవారి మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉంటాయన్న సంగతి విదితమే.
భారత్ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారూఖా ఖాన్‌లు ఇదివరకే టుస్సాడ్‌లో చోటు పొందగా.. ఈ ఏఫ్రిల్ నెలలో లిటిల్ మాస్టర్ కూడా వారి సరసన చేరనున్నాడు. ఈ మేరకు మ్యూజియం శిల్పకారుల బృందం కొన్నాళ్ల కిందట ముంబై వచ్చి సచిన్‌తో రెండు గంటలపాటు సమావేశమై.. సచిన్‌కు చెందిన ప్రతి వివరాన్నీ ఫోటోలలో బంధించటమే గాకుండా, శరీరపు కొలతలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై టుస్సాడ్ మ్యూజియం ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... సెంచరీ చేశాక సచిన్ పిచ్‌పై నిలుచుని అభివాదం చేస్తున్న భంగిమలో ఈ మైనపు బొమ్మ ఉంటుందని పేర్కొన్నారు. సచిన్ టెస్ట్ మ్యాచ్‌లలో ధరించిన తెలుపురంగు దుస్తులనే ఈ మైనం బొమ్మకు వేస్తామనీ.. వీటిని స్వయంగా లిటిల్ మాస్టరే అందించాడని ఆయన వెల్లడించాడు.
ఇదిలా ఉంటే... మాస్టర్ మైనపు బొమ్మ తయారీకి సుమారు లక్షన్నర పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 1.09 కోట్ల రూపాయలను టుస్సాడ్ మ్యూజియంవారు ఖర్చు చేయనున్నారు. క్రికెటర్లలో బ్రియాన్ లారా, షేన్‌వార్న్‌ల మైనపు బొమ్మలు ఇప్పటికే టుస్సాడ్‌లో కొలువుదీరి ఉన్నాయి. వీరి సరసన భారత లిటిల్ మాస్టర్ కూడా చేరబోతున్నాడు.