కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేయనుంది.
కానీ ఈసారి ఆటగాళ్ల ఎంపిక జాతీయ సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇందుకు టీం ఇండియా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు సైతం గాయాలకు గురవడమే ప్రధాన కారణమని జాతీయ సెలక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే టీం ఇండియా సీనియర్ ఆటగాళ్లలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలు గాయాలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మూడో సీజన్‌లోనే గాయాలతో పాల్గొనలేక తప్పుకున్న గంభీర్, ధోనీ, నెహ్రాలను ట్వంటీ-20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే విషయంలో సెలక్టర్లు తికమకపడుతున్నట్లు తెలిసింది.
ఇకపోతే.. ఇంగ్లాండ్‌లో గత ఏడాది జూన్‌లో జరిగిన ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో భారత్ టైటిల్‌ను కైవసం చేసుకోలేక పోయిన విషయం తెలిసిందే. దీనికి వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు గాయాలకు గురవడమే ప్రధాన కారణమని సెలక్టర్లు భావిస్తున్నారు.
ఇదే తరహాలో ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ పరిమిత ఓవర్ల ట్వంటీ-20లో భారత్ ధీటుగా రాణించే దిశగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని జాతీయ సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. కాగా.. వరల్డ్ కప్ ట్వంటీ-20 జట్టులో జాతీయ సెలక్టర్లు యువ క్రికెటర్లు లేదా సీనియర్ ఆటగాళ్లలో ఎవరికి స్థానం కల్పిస్తారో వేచి చూడాల్సిందే..!.