ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన బీసీసీఐ!
FILE
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి లేకుండా ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలను ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంకకు పంపడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇంకా బీసీసీఐ అనుమతి లేకుండా గంభీర్, నెహ్రాల లంక ప్రయాణంపై ఆ జట్టు వివరణ ఇవ్వాలని సంఘం కోరింది.
ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంకకు వెళ్ళే అంశంపై గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలు ముందుగానే బోర్డుకు తెలియజేయాల్సిన అవసరం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా శ్రీలంకకు గంభీర్, నెహ్రా ప్రయాణం కావడంపై వారిని హెచ్చరించడంతో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వాలని బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో గంభీర్ గాయానికి గురైయ్యాడు. అనంతరం 17వతేదీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్ల వద్ద గాయం కారణంతో మైదానం నుంచి గంభీర్ వైదొలగాడు. తదనంతరం గౌతం గంభీర్ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అలాగే మొహలీ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయానికి గురైయ్యాడు.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడుతోన్న తిలకరత్నే దిల్షాన్ సలహాతో పాటు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రమేయంతో శ్రీలంకలో చికిత్స తీసుకున్న గంభీర్, నెహ్రాలు 24వ తేదీన దేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే.