ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా, ఢిల్లీలో జరిగిన 55వ లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గత ఏడాది ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐపీఎల్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుని, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
146 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది.
అంతకుముందు బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తర్వాత డెక్కన్ ఛార్జర్స్ నిర్ధేశించి లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు షేన్ వార్నర్(5), సెహ్వాగ్(8) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
దిల్షాన్ (11), కెప్టెన్ గంభీర్ (4) పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో ఢిల్లీ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్మెన్లు ధీటుగా రాణించలేకపోవడంతో డెక్కన్ ఛార్జర్స్‌ను విజయం వరించింది.
ఇకపోతే.. ఢిల్లీ బౌలర్లలో నెహ్రా, యాదవ్‌లు చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, మిశ్రా, కాలింగ్‌వుడ్‌లు చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అలాగే డెక్కన్ ఛార్జర్స్ బౌలర్లలో హర్మీత్ సింగ్, ఓజా రెండేసి వికెట్లు సాధించగా, వాస్, మార్ష్‌లు చెరో వికెట్‌ను పడగొట్టారు. కాగా.. డెక్కన్ ఛార్జర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ సైమండ్స్ (54)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.