తొలి టెస్ట్: కివీస్‌ను ఆదుకున్న రైడర్-వెట్టోరి

బుధవారం, 18 మార్చి 2009 (09:05 IST)
స్వదేశంలో భారత్‌తో ఆరంభమైన తొలి టెస్టులో కష్టాల్లో కూరుకున్న న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ వెట్టోరి ఆదుకున్నాడు. భారత పేసర్ల ధాటికి 60 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రైడర్ (59), కెప్టెన్ డేనియల్ వెట్టోరి (77)లు ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచారు.

భారత పేసర్లలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని కివీస్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా కివీస్ కష్టాల్లో పడింది. అంతకుముందు హామిల్టన్‌లోని సెడెన్ పార్క్‌ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది.

తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కివీస్ స్కోరు 17 పరుగుల మీద ఉండగా కివీస్‌‍ తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. ఫలితంగా 60 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.

కివీస్ జట్టులో ఓపెనర్లు ఇంటోష్ (12), గుప్తిల్ (14), ఫ్లైన్ (0), టేలర్ (18), ఫ్రాంక్లిన్ (0), మెక్‌కల్లమ్ (3) త్వరగా పెవిలియన్‌కు చేరుకున్నారు. జహీర్ ఖాన్ రెండు, ఇషాంత్ శర్మ మూడు, మునాఫ్ పటేల్ ఒక వికెట్ చొప్పున తీశారు.

అంతకుముందు భారత తుది జట్టులో గంభీర్, సెహ్వాగ్, ద్రావిడ్, టెండూల్కర్, లక్ష్మణ్, యువరాజ్ సింగ్, ధోనీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్, మునాఫ్ పటేల్‌లకు చోటు కల్పించారు. కాగా, కివీస్ జట్టు తరపున ఓపెనర్ గుప్తిల్ తొలి టెస్ట్ ఆడుతూ అంతర్జాతీయ టెస్ట్ ఆరంగేట్రం చేశాడు.

వెబ్దునియా పై చదవండి