ధోనీ సేనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లపై ప్లాస్టిక్ బాటిల్ విసిరిన నేపథ్యంలో... మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టింది.
మంగళవారం నేపియర్‌లో జరిగే మొదటి వన్డేలో భారత జట్టు భద్రతను మరింత పటిష్టం చేయనున్నట్ల న్యూజిలాండ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జస్టిన్ వాన్ అన్నాడు. అలాగే మైదానంలో కూడా ధోనీ సేనకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తామని వాన్ చెప్పాడు.
ఆటగాళ్లపై బాటిల్ విసరడం వంటి సంఘటనలు దురదృష్టకరమని, పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు దృష్టి సారిస్తూనే ఉందని వాన్ అన్నాడు. ఇందులో భాగంగానే వచ్చే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తామని వాన్ హామీ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భారత్ రాణించే దిశగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ధోనీ సేన, వన్డేల్లో గట్టిపోటీని ప్రదర్శించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పిటికే వన్డే సిరీస్‌పై దృష్టి సారించాలని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు సభ్యులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.