కోచి ఫ్రాంఛైజీ వివాదంతో తనకు తానుగా పొగబెట్టుకున్న లలిత్ మోడీ, ఆ పొగ కాస్తా సెగతో కూడిన మంటలను చిమ్ముతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఐపీఎల్ క్రీడలో బ్లాక్ మనీ ఏరులై పారుతోందనీ, దానికి కారకుడు మోడీయోనని విపక్షాలు ఎండగడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయమాల్యా ఆయన పట్ల విశ్వసనీయతను ప్రకటించారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లను విజయవంతంగా నిర్వహించడంలో మోడీ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని విజయ్ మాల్యా పొగడ్తల జల్లు కురిపించారు.
విమర్శల పెనుతుఫానులో కొట్టుక పోతున్న మోడీకి మాల్యా మద్దతు ఊతం ఇచ్చినట్లయింది. అంతే... ట్విట్టర్లో మాల్యాకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ ఇచ్చుకున్నారు. కష్టకాలంలో తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ట్విట్టర్ పేజీ ద్వారా ఒకే ఒక్క ట్వీట్‌తో కేంద్రమంత్రి శశిథరూర్ పదవిని ఎగరగొట్టిన ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఇవాళో రేపో తన పదవిని కూడా వదులుకోవచ్చని వార్తలు వినబడుతున్నాయి. కోచి ఫ్రాంఛైజీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి శశి థూరర్‌పై కేంద్రం అత్యంత వేగంగా చర్య తీసుకుని ఇంటికి పంపింది. ఇప్పుడు లలిత్ మోడీ వ్యవహారంలో కూడా బీసీసీఐ అంతే వేగంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దేశానికి తిరిగి వచ్చిన వెంటనే మోడీ తనకు తానుగా రాజీనామా సమర్పిస్తే సరి... లేదంటే బలవంతంగా ఆయనను ఆ పదవి నుంచి తప్పించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తమ్మీద శశి థరూర్‌ను ఊడబెరకిన కోచి ఫ్రాంఛైజీ వివాదపు బాణం తిరిగి తన పదవిని కూడా కూలగొట్టేందుకు వస్తుందని బహుశాః మోడీ ఊహించి ఉండరు.