మిథాలీ మెరుపులు... సూపర్‌ సిక్స్‌లో భారత్..!

సిడ్నీలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో... హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్ మరోసారి తన బ్యాట్ సత్తాను రుచి చూపించింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఒంటిచేత్తో మిథాలీ ఒడ్డుకు చేరవేసింది. ఫలితంగా గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో.. శ్రీలంక జట్టుపై విజయం సాధించి, సూపర్‌సిక్స్‌కు అర్హత సాధించింది.

సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 120 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సాధించింది. కాగా, శనివారం జరిగే సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.

ఇదిలా ఉంటే... కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బ్యాట్స్‌ఉమెన్ మూకుమ్మడిగా వైఫల్యం చెందడంతో జట్టు కష్టాల్లో పడిపోయింది. లంక బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ నిలువెల్లా వణికిపోయింది. ఫలితంగా 78 పరుగులకే 7 వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది.

అలాంటి దశలో కెప్టెన్ జులన్ గోస్వామితో జత కట్టిన మిథాలీ.. స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు కదిలించింది. ఇదే క్రమంలో ఆమె వన్డేల్లో 28వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 137 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం లంక ఇన్నింగ్స్ భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని మరిపిస్తూ.. వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్న లంక తగిన మూల్యం చెల్లించుకుంది. ఆపై భారత్ విజయం సాధించి సూపర్ సిక్స్‌కు దూసుకెళ్లింది.

వెబ్దునియా పై చదవండి