మోడీపై ఆరోపణలు: బీసీసీఐ కార్యవర్గ సమావేశం వాయిదా!

FILE
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్‌ లలిత్ మోడీ ఎదుర్కొంటున్న ఆరోపణలపై కమిటీ కార్యవర్గ సమావేశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్చించనుంది.

ఏప్రిల్ 24 నుంచి మే రెండో తేదీ లోపు జరుగనున్న బీసీసీఐ కార్యవర్గ సమావేశంలో భాగంగా, కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో లలిత్ మోడీ ప్రమేయం ఏమిటి? అనే విషయంపై బీసీసీఐ అధికారులు సమగ్ర విచారణ జరుపుతారు. ఈ నెల 25వ తేదీతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం పూర్తి కానుంది. ఈ సమావేశానికి అనంతరం బీసీసీఐ కార్యవర్గ సమావేశం ఉంటుందని తెలిసింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ మీడియా మరియు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ, కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీకి వ్యతిరేకంగా వెలువెత్తిన ఆరోపణలపై కౌన్సిల్ చర్చలు జరిపిందని స్పష్టం చేశారు.

మోడీ వ్యవహారంపై సమగ్ర చర్చలు జరిపేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోందని, త్వరలో బీసీసీఐ కార్యవర్గ సమావేశం జరిగే కచ్చితమైన తేదీని ప్రకటిస్తామని శుక్లా తెలిపారు. బీసీసీఐ కార్యవర్గ సమావేశాన్ని కీలక అంశాలపై చర్చించేందుకే వాయిదా వేశామని శుక్లా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అందజేయాల్సిన ఐటీ శాఖ ఆదేశించింది. ఇంతకుముందు ఐపీఎల్-4లో చేర్చిన కొచ్చి, పూణే జట్ల వివరాలను మాత్రమే అడిగిన ఐటీ శాఖ ఈసారి ఐపీఎల్‌లో ఆడే పూర్తి జట్ల వివరాలను అందజేయాల్సిందిగా కోరింది.

ఐపీఎల్‌లో ఆడే జట్లు, జట్ల వాటాదారులు, క్రికెటర్ల వేలం మరియు ఐపీఎల్ జట్ల విక్రయాల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖ కోరినట్లు బీసీసీఐ ముఖ్యపాలనాధికారి రత్నాకర్ శెట్టి తెలిపారు.

ఈ వివరాలపై ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, ఐపీఎల్ నిర్వాహ కార్యదర్శి సుందర రామన్ ఐటీ శాఖకు అన్ని వివరాలు అందజేస్తారని రత్నాకర్ అన్నారు. గత 2008 సంవత్సరం ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ ఏడాది వరకు జరిగిన లావాదేవీల వివరాలను ఐటీ శాఖ కోరిందని రత్నాకర్ వెల్లడించారు.

మరోవైపు.. లలిత్ మోడీ-శశిథరూర్‌ల కొచ్చి ఫ్రాంచైజీ వివాదంతో ఐపీఎల్‌లో పలు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిసింది. ఐపీఎల్ జట్లకు చెందిన యజమానుల్లో చాలా మంది తమ వద్ద నున్న బ్లాక్ మనీని ఇందులో పెట్టుబడి చేస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి