యువరాజ్‌ అర్ధసెంచరీ : కివీస్ విజయ లక్ష్యం 150

వెల్లింగ్టన్‌లో టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో... భారత్ కివీస్‌కు 150 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ వెటోరీ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ టాప్‌ ఆర్డర్‌ మళ్లీ ఘోరంగా విఫలం అయింది.

ఓపెనర్‌గా బరిలో దిగిన వీరేంద్ర సెహ్వాగ్.. మరోసారి వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో 11 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు సాధించి వెటోరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ 13 బంతుల్లో ఒక సిక్సర్‌తో 10 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు.

ఇకపోతే తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సురేష్ రైనా డకౌట్ కాగా... ఆ తరువాత బరిలో దిగిన యువరాజ్ సింగ్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ధోనీతో జతకట్టిన యూవీ చెలరేగి ఆడి 34 బంతుల్లో మూడు ఫోర్లు, 6 సిక్స్‌లతో అర్ధసెంచరీ సాధించాడు. అయితే వెంటనే ఓరమ్‌కు క్యాచ్ ఇచ్చిన యూవీ వెనుదిరిగాడు.

యూవీ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన యూసుఫ్ పఠాన్ పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అవగా, ఆ తరువాత వచ్చిన రవీంద్ర జడేజా ఒక ఫోర్‌తో కలిపి 19 పరుగులు చేసి గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ నేపథ్యంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరిగా ఎదురీదుతూ 24 బంతుల్లో ఒక ఫోర్‌‌తో సహా 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ధోనీకి జతకట్టిన ఇర్ఫాన్ పఠాన్‌ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీం ఇండియా 149 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి