రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికలు: మోడీ ఓటమి

ఆదివారం జరిగిన రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోడీ పరాజయం పాలైయ్యారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న లలిత్ మోడీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ చేతిలో ఓటమి చవిచూశారు.

32 జిల్లా యూనిట్లకు చెందిన ఏజీఎంలు పాల్గొన్న ఈ ఎన్నికలు ఓటింగ్ ఆదివారం 11 గంటల నుంచి 1 గంట వరకు జరిగింది. అధ్యక్ష పదవికి జరిగిన ఓటింగ్‌లో దీక్షిత్‌కు 18 ఓట్లు లభించగా, లలిత్ మోడీ 13 ఓట్లు పొందారు. ఇదిలా ఉంటే కార్యదర్శి పదవికి పోటీ చేసిన అమీర్ పఠాన్ 12-19 ఓట్ల తేడాతో అశోక్ కుమార్ ఓహ్రీ చేతిలో పరాజయం చవిచూశారు.

రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం లలిత్ మోడీ ఇతర పదవులపై ఎటువంటి ప్రభావం చూపదు. ఆయన ప్రస్తుతం ఐపీఎల్ కమిషనర్‌గా, బీసీసీఐ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మోడీ రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పంజాబ్ క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడి బాధ్యతలను కూడా మోడీ నిర్వహిస్తున్నారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసిన మోడీతోపాటు, ఇతర పదవులకు పోటీ చేసిన ఆయన సానుభూతిపరులు కూడా తాజా రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పరాజయాలు చవిచూశారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తన ఓటమికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మోడీ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు సన్నిహితంగా మెలిగినందుకు మూల్యం చెల్లించుకున్నానన్నారు.

తనను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల ఫలితాలు జైపూర్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లపై ఎటువంటి ప్రభావం చూపబోవని లలిత్ మోడీ స్పష్టం చేశారు. జైపూర్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లు యథాతథంగా జరుగుతాయన్నారు.

వెబ్దునియా పై చదవండి