లంక ఆటగాళ్లకు పరిహారం అందుతుందా..?!

లాహోర్‌లో ఉగ్రవాదుల దాడి నుంచి బ్రతికి బయటపడ్డ శ్రీలంక ఆటగాళ్లకు ఇంకా నష్టపరిహారం అందలేదు. అసలు అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పరిహారం విషయంలో లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సి) ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని స్థానిక పత్రికలు ఆరోపిస్తున్నాయి.

దాడిలో గాయపడ్డ లంక క్రికెటర్లకు వైద్య సేవలయితే అందాయిగానీ... పరిహారం చెల్లించే విషయంలో బోర్డు నుంచి ఎలాంటి స్పందనా లభించటం లేదని పై మీడియా కథనం వెల్లడించింది. దాడిలో గాయపడ్డ లంక ఆటగాళ్లు, అధికారులు అనుభవించిన మానసిక వేదన, భయాందోళనలకు బీమా పాలసీలో కవరేజి లేదు కాబట్టి, వారికేమీ పరిహారం అందటం లేదని మీడియా ఆరోపించింది.

ఇదిలా ఉంటే... పాకిస్థాన్ జట్టుతో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న శ్రీలంక జట్టు.. మార్చి మూడవ తేదీన లాహోర్లోని గడాఫీ స్టేడియంకు వెళుతుండగా... 12 మంది సభ్యులు గల ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో లంక జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు, ఒక అసిస్టెంట్ కోచ్‌ గాయపడగా, లంక ఆటగాళ్లకు భద్రత కల్పిస్తున్న ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి