వీరూ తర్వాతే మాస్టర్ బ్లాస్టర్ : ఓబ్రియాన్

విధ్వంసకర బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే ముందుంటాడని.. న్యూజిలాండ్ బౌలర్ ఇయాన్ ఓబ్రియాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌలర్లపై విరుచుకుపడే బ్యాట్స్‌మెన్లలో వీరూనే ముందుంటాడని ఓబ్రియాన్ కితాబిచ్చాడు.

సచిన్, సెహ్వాగ్‌లలో ఎవరు ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఓబ్రియాన్ సమాధానమిస్తూ.... క్రైస్ట్‌చర్చ్‌లో సచిన్ అద్భుతంగా ఆడాడనీ, అయితే విధ్వంసకర బ్యాటింగ్‌కే వీరూకే తన ఓటని తేల్చి చెప్పాడు. కాగా, వీరూ దూకుడైన ఆటతో కివీస్ బౌలర్ల ఆత్మస్థైర్యం దెబ్బతిందని కివీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ కూడా వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇదిలా ఉంటే... వన్డే సిరీస్‌లో కేవలం మూడు వికెట్లతో మాత్రమే సరిపెట్టుకున్నప్పటికీ... టెస్ట్ సిరీస్‌లో బాగా రాణిస్తానని ఓబ్రియాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో వ్యక్తిగత వ్యూహం ప్రకారం ఎక్కువసేపు బౌలింగ్ చేసే వీలుంటుందనీ, సంప్రదాయ బ్యాట్స్‌మెన్ ఉంటే ఉత్కంఠత తక్కువగా ఉన్నా, అయితే తన పని మాత్రం సులువవుతుందనీ అన్నాడు.

కాగా.. టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని తాను ప్రేమిస్తాననీ, అలాగే వన్డే క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తాననీ ఓబ్రియాన్ చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. వన్డే సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన తన కెరీర్‌కు వచ్చిన ముప్పేమీ లేదనీ.. తనకూ అందరిలాగా మంచి రోజులు వస్తాయని పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి