వెల్లింగ్టన్ తొలి టెస్టు: కివీస్‌పై ఆస్ట్రేలియా విజయం

PTI
వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఐదు రోజైన మంగళవారం న్యూజిలాండ్ నిర్ధేశించిన 106 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. దీంతో రెండు టెస్టు పోటీలతో కూడిన ఈ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

369/6 స్కోరుతో మంగళవారం ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో మెక్‌కల్లమ్ సెంచరీ సాధించి 104 పరుగుల వద్ద రియాన్ హారిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మొత్తం 187 బంతులాడిన మెక్‌కల్లమ్ 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 104 పరుగులు సాధించాడు. ఇలాగే టఫీ కూడా నిలకడగా ఆడి 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ టఫీ చేతి వేలికి తీవ్రగాయం ఏర్పడటంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఇతడు ఆడటం అనుమానమేనని తెలుస్తోంది. మొత్తానికి న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 407 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఇకపోతే.. 106 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఫిలిప్, కటిచ్‌ల అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. దీంతో ఆస్ట్రేలియా 23వ ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది. దీంతో లంచ్ విరామానికే ఆస్ట్రేలియా గెలుపును నమోదు చేసుకుని, మ్యాచ్‌ను ముగించింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లలో ఫిలిప్ హగ్స్ 75 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 86 పరుగులు సాధించగా, మరో ఓపెనర్ కటిచ్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇకపోతే.. తొలి టెస్టులో 168 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ మైకేల్ క్లార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి