సహారాకు సచిన్‌ కెప్టెన్‌గా ఉంటే బాగుండు: రాయ్

FILE
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ జట్టు సహారా గ్రూప్‌కు కెప్టెన్సీ సారథ్యం వహిస్తే బాగుంటుందని సహారా గ్రూప్ అధ్యక్షుడు సుబ్రతో రాయ్ వ్యాఖ్యానించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్, తమ జట్టు కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నట్లు రాయ్ తెలిపారు. ఇంకా తమ జట్టుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్‌గా వ్యవహించాలని రాయ్ ఆకాంక్షించారు. దీనికోసం అమితాబ్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం ఉన్నట్లు సుబ్రతో వెల్లడించారు.

తమ జట్టుకు సచిన్ లాంటి క్రికెట్ సూపర్ స్టార్‌ను కెప్టెన్‌గా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే తప్పకుండా ఐపీఎల్‌లో సహారా రాణిస్తుందని రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆటగాళ్ల ఒప్పందం మూడో సీజన్‌తో ముగియనుండటంతో, వచ్చే మూడేళ్లకుగాను సెప్టెంబర్‌లో ఐపీఎల్ యాజమాన్యం వేలం పాట నిర్వహించనుంది.

ఇదిలా ఉంటే.. ఆదివారం ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ నాలుగో సీజన్‌కు రెండు కొత్త జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పుణే ఫ్రాంచైజీ జట్టును రూ.1,700 కోట్లతో సహారా గ్రూప్ సొంతం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి