హోం శాఖకు ఐపీఎల్ మూడో షెడ్యూల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ నిర్వహణ కోసం నిర్వాహకులు మూడో షెడ్యూల్‌ను తయారు చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ రెండూ దాదాపుగా ఒకే సమయంలో జరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్‌లకు భద్రతపరమైన సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే.

కొన్ని రాష్ట్రాలు మావల్ల కాదని, మరికొన్ని రాష్ట్రాలు అదనపు దళాలు పంపితే ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం సాధ్యపడుతుందని చెప్పడంతో.. హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులతో కొత్త షెడ్యూల్ ఖారారు చేయాలని సోమవారం ఐపీఎల్ నిర్వాహకులకు సూచించింది.

ఇప్పటికే ఈ టోర్నీ కోసం సిద్ధం చేసిన రెండు షెడ్యూల్‌లను హోంశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం మంగళవారం మూడో షెడ్యూల్‌ను సిద్ధం చేసి హోంశాఖ ముందుంచింది.

ఐపీఎల్ భద్రతపై సోమవారం హోంశాఖ, బీసీసీఐ అధికారిక బృందం మధ్య జరిగిన చర్చల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ నుంచి తమకు ఈ రోజు కొత్త షెడ్యూల్ వచ్చిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపనున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి