ఇంగ్లాండ్‌పై 'టీమ్ ఇండియా' హ్యాట్రిక్ విజయం

'టీమ్ ఇండియా' హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో గురువారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 16 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 241 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత జట్టు 40 ఓవర్లలో 198 పరుగులు చేసింది.

అయితే మైదానంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది.

మైదానంలో దట్టమైన పొగమంచు అలముకోవడంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 48.4 ఓవర్లలో 240 పరుగులు చేసి, అన్ని వికెట్లను కోల్పోయింది. ఆ జట్టులో రవి బొపరా (60), బెల్ (46), షా (40), ఫ్లింటాఫ్ (26), పటేల్ (26) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ ముంగిట 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

ఆతర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ 40 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లను కోల్పోయి 198 పరుగులు చేసింది. భారత జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులతో రాణించగా, రోహిత్ శర్మ (28), యువరాజ్ సింగ్ (38)లు తమ వంతు సహకారం అందించారు.

వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు మ్యాచ్ నిలిపి వేసే సమయానికి కెప్టెన్ ధోనీ 29, యూసఫ్ పఠాన్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్లింటాఫ్ మూడు వికెట్లు తీయగా, భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు, పటేల్, ఇషాంత్ శర్మలు రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్భజన్ సింగ్ అందుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి