టీమ్ ఇండియాతో జరుగనున్న తొలిటెస్టులో ఆడేందుకు భారత్ వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉత్తరాది వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటున్నారట. ఉత్తరాది స్పెషల్ వెరైటీస్ బటర్ చికెన్, తందూరీ రాన్ దమ్‌లను కంగారూలు భేష్ భేష్ అంటూ లాగిస్తున్నారట.
వీటితో పాటు బట్టి కా ముర్గ్, పప్పు ధాన్యాలు, తాజా ఫలాలు ఆరగించడానికి ఆసీస్ క్రికెటర్లు మొగ్గుచూపుతుంటే.. రికీ పాంటింగ్ మాత్రం బ్లాక్ దాల్ మరో ప్లేట్ పట్టుకురా అంటూ ఆర్డర్ చేసేస్తున్నాడట.
భారత్‌తో తొలిటెస్టుకు ముందు ప్రాక్టీసు మ్యాచ్ ఆడడానికి భారత్‌కు వచ్చిన పాంటింగ్ సేన, హోటల్ తాజ్‌లో బసచేసింది. వచ్చినప్పటి నుంచి హోటల్‌లోని మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ "డేరా"లోనే కంగారూలు ఎక్కువ సమయం కనిపిస్తున్నారని, ఇంకా ఉత్తరాది వంటకాలంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు పడిచస్తున్నారని హోటల్ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. భారత్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పోరు ఆరంభం కాబోతోంది. ఇందులో భాగంగా ఆసీస్ శనివారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
రికీ పాంటింగ్ సారథ్యంలోని పటిష్టమైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సమరానికి సై అంటోంది. మరోవైపు గాయాల నుంచి కోలుకున్న గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌లు బోర్డు జట్టు తరఫున ఆడనున్నారు. యువరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ‘పరుగుల యంత్రం’ చటేశ్వర్ పుజారాపైనే అందరి దృష్టి నెలకొంది. మరి కంగారూల జట్టుతో బోర్డు ఎలెవన్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే..!.