కటక్ వన్డే : విజృంభించిన భారత ఓపెనర్లు

బుధవారం, 26 నవంబరు 2008 (20:35 IST)
ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు విజృంభించి అర్థ సెంచరీలు సాధించడంతో ఇంగ్లాండ్ విధించిన 271 పరుగుల విజయలక్ష్యాన్ని సులభంగా చేధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీంతో ప్రస్తుతం భారత్ 21 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 140 పరుగుల వద్ద కొనసాగుతోంది.

ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (82), యువరాజ్ సింగ్ (4)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హార్మిసన్ ఓ వికెట్ తీసుకున్నాడు. లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా సెహ్వాగ్ విజృంభించడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి.

వేగంగా పరుగులు సాధించే దిశగా సెహ్వాగ్ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అయితే అర్థ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న సచిన్ (50)ను హార్మిసన్ ఔట్ చేశాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి