చెన్నై టెస్ట్: పీకల్లోతు కష్టాల్లో భారత్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్న పర్యాటక ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు శ్రమించి కట్టడి చేశారు. అయితే బౌలర్ల శ్రమను మన బ్యాట్స్‌మెన్స్‌ నీరుగార్చారు. అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

కేవలం 37 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయిన భారత్‌ను గట్టెక్కించేందుకు సచిన్ - లక్ష్మణ్‌లు కొంత సేపు ఇంగ్లండ్ బౌలర్ల ఎదురుదాడిని ప్రతిఘటించినా భారత్‌ను సురక్షిత తీరాలకు చేర్చలేక పోయారు. దీంతో భారత్ రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. రెండో రోజు ఆద్యంతం ఇంగ్లండ్ బౌలర్లు పూర్తి అధిపత్యం చూపించారు.

అంతకుముందు తొలి రోజు ఓవర్‌నైట్ స్కోరు 229/5తో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలు మూడేసి వికెట్లు తీయగా, జహీర్ ఖాన్ రెండు, ఇషాంత్ శర్మ, యువరాజ్ సింగ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

అంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సెహ్వాగ్‌ (9)ను ఆండర్సన్ బౌల్డ్ చేసి తొలి దెబ్బ తీశాడు. అక్కడ నుంచి భారత్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. జట్టు స్కోరు 34 పరుగులపై ఉండగా గంభీర్ (19), 37 పరుగుల వద్ద ద్రావిడ్ (3) పరుగులకు వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో భారత జట్టు 37 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన టెండూల్కర్ (37), లక్ష్మణ్ (24)లు జట్టును రక్షించే చర్యలు చేపట్టినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. ఆ తర్వాత భారత్ త్వరితగతిన వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 155 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు మరో 161 పరుగుల వెనుకబడి ఎదురీదుతోంది. ఇంగ్లండ్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించి భారత వికెట్లను చేజిక్కించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి