ఛాంపియన్స్ లీగ్ సమరానికి సన్నద్ధమైన దక్షిణాఫ్రికా!

FILE
సఫారీల గడ్డపై ఛాంపియన్స్ లీగ్ ఢంకా మోగనుంది. పక్షం రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండుగ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. పది దేశాల నుంచి ఆరు జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రె "ఢీ" అంటున్నాయి. గతేడాది భారత్ వేదికగా జరిగిన ఈ పోటీలను ఈ మారు దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్నారు. పోటీలు ఈ నెల 10 నుంచి 26 వరకు జరుగుతాయి.

టోర్నీలో 6 దేశాల (భారత్-3, ఆస్ట్రేలియా-2, దక్షిణాఫ్రికా-2, న్యూజిలాండ్-1, శ్రీలంక-1, వెస్టిండీస్-1) నుంచి మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం మ్యాచ్‌లు 23. పదహారు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం నాలుగు వేదికలు (జొహాన్నెస్‌బర్గ్, పోర్ట్ఎలిజబెత్, డర్బన్, సెంచూరియన్) ముస్తాబయ్యాయి.

అలాగే విజేతగా నిలిచిన జట్టుకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. చాంపియన్స్‌లీగ్‌లో విజేత జట్టుకు భారీ స్థాయిలో రూ. 11.5 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కనుంది. రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్లు లభిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్లకు రూ. 2.3 కోట్లు, చివరి 6స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 92 లక్షలు ప్రైజ్‌మనీగా అందజేస్తారు.

కాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే, కల్లీస్, కామెరూన్ వైట్, ఎన్తినీ లాంటి దిగ్గజాలు ఒకే టోర్నీలో పాల్గొనే ఛాంపియన్స్ లీగ్ పోటీల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే భారత్ నుంచి ఐపీఎల్ మూడో సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ , రన్నరప్ సచిన్ సేన ముంబయి ఇండియన్స్, అనిల్ కుంబ్లే కెప్టెన్సీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి.

మొత్తం 10 జట్లను గ్రూప్-ఎ, బి లుగా విభజించారు. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని ప్రత్యర్థి జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ‌స్‌లోకి అడుగుపెడతాయి. ఇందులో తొలి సెమీఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 24వ తేదీన జరుగనుండగా, రెండో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరుగుతాయి.

లీగ్ దశ మ్యాచ్‌లు సెప్టెంబర్ పదో తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల నుంచి డే మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. డే/నైట్ మ్యాచ్‌లు రాత్రి 9 గంటల నుంచి జరుగుతాయి.

పాల్గొనే జట్ల పేర్లు: స్టాగ్స్ (న్యూజిలాండ్: కెప్టెన్-జామీ హౌ), వయాంబ (శ్రీలంక: కెప్టెన్-ముబారక్), బుష్‌రేంజర్స్ (ఆస్ట్రేలియా: కెప్టెన్-డేవిడ్ హస్సీ), వారియర్స్ (దక్షిణాఫ్రికా: కెప్టెన్-జేకబ్స్), చెన్నై (భారత్: కెప్టెన్-ధోనీ), ముంబై (భారత్: కెప్టెన్-సచిన్), లయన్స్ (దక్షిణాఫ్రికా: కెప్టెన్-పీటర్సన్), రెడ్‌బ్యాక్స్ (ఆస్ట్రేలియా: కెప్టెన్-క్లింగర్), బెంగళూరు (భారత్: కెప్టెన్-కుంబ్లే), గయానా (వెస్టిండీస్: కెప్టెన్-శర్వాణ్).

ఇకపోతే.. గ్రూప్-ఎ విభాగంలో చెన్నై, వారియర్స్, బుష్ రేంజర్స్, వయాంబ, సెంట్రల్ స్టాగ్స్‌ జట్లుండగా, గ్రూప్-బి విభాగంలో ముంబై, లయన్స్, రెడ్ బ్యాక్స్, బెంగళూరు, గయానా జట్లున్నాయి.

వెబ్దునియా పై చదవండి