లక్ష్యం పెద్దదే.. కానీ ఏం జరిగిందీ...?!! ధోనీ సేనకు "వార్మప్" వార్నింగ్...!!!

సోమవారం, 17 సెప్టెంబరు 2012 (19:02 IST)
FILE
ట్వంటీ20 మ్యాచుల్లో గెలుపు మునుపటిలా నల్లేరు నడక కాదని తేలిపోయింది. భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబోలో జరిగిన వార్మప్ మ్యాచ్ ధోనీ సేనకు గట్టి వార్నింగే ఇచ్చింది. ఆ... ఏదో వార్మప్పే కదా అనుకుంటే పొరబాటేనని పాకిస్తాన్ బ్యాట్సమన్లు హెచ్చరించారు.

మన బ్యాట్సమన్లు బంతులను జిడ్డాడటం ఎక్కవయింది. మొన్నటి కివీస్- భారత్ ట్వంటీ20లో కూడా ధోనీ బంతులను జిడ్డు ఆడి మ్యాచ్‌ను న్యూజీలాండ్‌ చేతిలో పెట్టేశాడు. ఇవాళ చూస్తే... ఇర్ఫాన్ పఠాన్, బాలాజీలిద్దరూ ఏమాత్రం పదును లేని బంతులను వేసి సిక్సర్లకు తెర తీశారు. ప్రత్యర్థి బ్యాట్సమన్లు ఒకవైపు సిక్సులుపై సిక్సులు బాదుతున్నా తమ ఆట తీరును ఎంతమాత్రం మార్చుకోకుండా వరుసగా అదే ఆటతీరును కనబర్చి పాకిస్తాన్ బ్యాట్సమన్లకు చక్కగా పరుగులకు సహకరించారు.

ఒక్క అశ్విన్ మాత్రమే బ్యాట్సమన్ మూడ్‌ను గమనిస్తూ వారి వెన్ను విరిచేందుకు యత్నించాడు. మిగిలినవారంతా బంతులను వేయడం తప్పించి బ్యాట్సమన్ వికెట్ తీయాలన్న ప్రణాళిక లేనట్లు స్పష్టంగా అర్థమయిపోతోంది. అందుకే ఇర్ఫాన్ పఠాన్ 3.1 ఓవర్లలో 40 పరుగులిస్తే, బాలాజీ 4 ఓవర్లలో 41, హర్భజన్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చారు.

ఇక మనవాళ్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లి(75), రోహిత్ శర్మ(56), వీరేంద్ర సెహ్వాగ్(26) తప్పించి మిగిలిన బ్యాట్సమన్లు మరింతగా రాణించాల్సి ఉంది. లేదంటే వార్మప్ మ్యాచ్‌లో జరిగిన సంఘటనలే పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

వెబ్దునియా పై చదవండి