టీమ్ ఇండియాను కష్టాల్లో గట్టెక్కించే హైదరాబాదీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వీవీఎల్ లక్ష్మణ్ కల నెరవేరబోతోంది. తన అంతర్జాతీయ కెరీర్‌లో 115 టెస్టులాడిన వీవీఎస్ లక్ష్మణ్, సుదీర్ఘ కాలం గడిచిన పిమ్మట.. లక్ష్మణ్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు త్వరలో వచ్చేస్తోంది. అది.. శుక్రవారం.. ఈ నెల 12వ తేది. సొంత గడ్డపై.. ఏళ్ల తరబడి అభిమానిస్తున్న సొంత ఊరి అభిమానులు.. శ్రేయోభిలాషులు.. కెరీర్‌కు చేదోడువాదోడుగా నిలిచిన క్రికెట్ పెద్దలు ప్రత్యక్షంగా వీక్షించేలా వీవీఎస్ లక్ష్మణ్ బరిలోకి దిగనున్నాడు.
సొంతగడ్డపై ఆడేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తున్న లక్ష్మణ్, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలిసారి లక్ష్మణ్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది.
టెస్టులు ఆడే అన్ని దేశాలతో ఆడిన లక్ష్మణ్‌కు హైదరాబాద్‌లో మాత్రం ఇదే తొలి టెస్టు. హైదరాబాద్‌లో జరిగిన అన్ని టెస్టులూ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగాయి. న్యూజిలాండ్‌తోనూ ఇంతకు ముందు ఎల్‌బి స్టేడియంలో 1988లో భారత్ ఆడింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్న భారత జట్టులో వి.వి.ఎస్.లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓఝా ఆడుతున్నారు.
కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో కష్టాల్లో కూరుకుపోయి, ఓటమి అంచున చేరిన భారత జట్టును లక్ష్మణ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్, పంజాబ్ సెంచరీ వీరుడు హర్భజన్ సింగ్‌ల ద్వయం బ్యాట్ ఝుళిపించడం వల్ల భారత్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగిన విషయం విదితమే. తృటిలో శతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన లక్ష్మణ్ సొంత గడ్డపై జరుగనున్న రెండో టెస్టులో దాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.