'స్పాట్ ఫిక్సింగ్‌'కు చిక్కనోడు ఆ ఒక్కడే..!

FILE
'చిక్కడు.. దొరకడు' అన్న చందంగా యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 'స్పాట్ ఫిక్సింగ్' వ్యవహారంలో పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రమే చిక్కలేదట. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ పేలవమైన ప్రదర్శనతో ఈ కెప్టెన్సీ వద్దురా బాబూ అంటూ టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన షాహిద్ అఫ్రిదికి మంచే జరిగింది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో షాహిద్ అఫ్రిది ఒక్కడే క్రికెట్ అభిమానులకు చిక్కలేదు.

ఆస్ట్రేలియాతో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ 150 పరుగుల తేడాతో ఓటమిపాలైన తర్వాత, టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి షాహిద్ అఫ్రిది వైదొలగిన విషయం తెలిసిందే. కాగా.. స్పాట్ ఫిక్సింగ్ కోసం పాక్ క్రికెట్ జట్టులో దాదాపు అందరిని బుట్టలేవేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన బుకీ మజీద్, షాహిద్ అఫ్రిదీ విషయంలో మాత్రం ఓడిపోయానన్నాడు.

ఇంకా అఫ్రిది అంగీకరించి ఉంటే ఐదేళ్ల క్రితమే అతనితో ఒప్పందం కుదుర్చుకునే వాడినని మజీద్ అంటున్నాడు. కానీ.. షాహిద్ అఫ్రిది మాత్రం నన్ను దగ్గరికి చేర్చనివ్వలేదని, ఇక మిగిలిన పాక్ ఆటగాళ్లతో నా అనుబంధం సొంత తమ్ముళ్లలాంటిదని మజహర్ మజీద్ వెల్లడించాడు. మొత్తానికి షాహిద్ అఫ్రిది మాత్రమే స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో "చిక్కడు దొరకడు" అని మజీద్ చెప్పకనే చెప్పాడు.

అలాగే రివ్వున దూసుకెళ్లే కార్లు, అమ్మాయిలంటే పడి చస్తానని మజీద్ అతనే స్వయంగా వెల్లడించాడు. స్పాట్ ఫిక్సింగ్‌లో బుక్కయిన పాకిస్తానీ బుకీ మజీద్.. ఓ బ్రిటన్ టాబ్లాయిడ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఈ సంగతులు బయటపడ్డాయి.

2002లో తనకు వివాహం జరిగిందని, పెళ్లికి తర్వాత తనలో మార్పు వచ్చిందని మజీద్ అన్నాడు. అయితే తనలోని బలహీనతలను అధిగమించడానికి ఎంతో సంఘర్షణకు గురయ్యానని చెప్పాడు. ఇంకా "నేను తాగుతాను, సిగరెట్లు కాల్చుతాను, వీటికి తోడు అమ్మాయిల బలహీనతకూడా ఉంద"ని ఆ వీడియోలో వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి