1000కి పైగా బౌండరీలు సాధించిన ఏడో క్రికెటర్‌గా సెహ్వాగ్!

FILE
శ్రీలంక గడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా కివీస్‌తో బుధవారం జరిగిన కీలక వన్డేలో టీమ్ ఇండియాను ఒంటి చేత్తో గెలిపించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో వెయ్యి బౌండరీలు దాటిన ఏడో క్రికెటర్‌గా సెహ్వాగ్ నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో మిల్స్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ బౌండరీని సాధించడంతో సెహ్వాగ్ ఈ రికార్డును లిఖించుకున్నాడు.

అలాగే 31 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ కివీస్‌తో జరిగిన ట్రై-సిరీస్ చివరి లీగ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా తన వన్డే ఖాతాలో 13వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇదేవిధంగా సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌లోనూ వీరేంద్ర సెహ్వాగ్ (1007) వెయ్యి బౌండరీలను దాటిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. దీంతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో రెండువేల బౌండరీలను సాధించిన నాలుగో క్రికెటర్‌గా సెహ్వాగ్ ఘనతకెక్కాడు.

ఇప్పటికే సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారాలు టెస్టు, వన్డేల్లో వెయ్యికి పైగా బౌండరీలను సాధించిన రికార్డులను కలిగివున్నారు. వన్డే ఫార్మాట్‌లో వెయ్యికి పైగా బౌండరీలు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్, 442 వన్డే మ్యాచ్‌ల్లో (1927 బౌండరీలతో) 2వేల బౌండరీ రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు.

అలాగే 444 వన్డే మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక క్రికెటర్ జయసూర్య 1500 బౌండరీలు సాధించాడు. ఇదేవిధంగా 351 వన్డే మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 1164 బౌండరీలు, 287 మ్యాచ్‌లాడిన గిల్ క్రిస్ట్ 1162 బౌండరీలు సాధించారు. అలాగే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1122 బౌండరీలు కొట్టాడు.

ఇకపోతే.. 299 మ్యాచ్‌ల్లో ఆడిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా 1035 బౌండరీలు సాధించగా, వీరేంద్ర సెహ్వాగ్ (227 మ్యాచ్‌లు) 1013 బౌండరీలు సాధించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి