కుప్పగూలిన కేదార్... తలవంచిన భారత్.. మోర్గాన్ వ్యూహంతో ఇంగ్లండ్ మెరుపు విజయం..

సోమవారం, 23 జనవరి 2017 (02:50 IST)
చివరి బంతివరకు గెలుపోటములు ఎవరి పక్షాన నిలుస్తోయో తెలీని భీకర ఉత్కంఠ భరిత పోరులో ఇంగ్లండ్ గెలిచింది. మరోలా చెప్పాలంటే భారత్ పోరాడి ఓడింది.  చివరి బంతివరకు విజయాన్ని భారత్ ముంగిట నిలిపి కోట్లాది ప్రేక్షకులను ఊరించిన కేదార్ జాదవ్ తీవ్ర విషాదంతో పెవిలియన్ బాట పట్టినప్పుడే భారత్ విజయం ఖరారయింది. ఓడి గెలిచిన కేదార్ విజృంభణ ఈడెన్ గార్డెన్స్‌ను మురిపించింది, చివరలో కన్నీరు పెట్టించింది. వేలమంది స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవిస్తున్న క్షణంలో కేదార్ భారత్ భవిష్యదాశల ప్రతిరూపంలా, ధోనీ అసలైన వారసుడిగా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 5 టెస్టు మ్యాచ్‌లు, 3 వన్డే పోటీల్లో తొలి గెలుపు ఇంగ్లండ్ అందుకున్నదంటే ఆ జట్టు కేప్టెన్ మోర్గాన్ చివరి రెండు ఓవర్లలో పన్నిన అద్భుత వ్యూహ రచనే కారణం. 
 
ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్‌), స్టోక్స్‌ (39 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌ స్టో (64 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 316 పరుగులు చేయగలిగింది. కేదార్‌ జాదవ్‌ (75 బంతుల్లో 90; 12 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత ప్రదర్శన కనబర్చగా, పాండ్యా (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 55; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఛేదనలో జాదవ్, పాండ్యా ఆరో వికెట్‌కు 7.51 రన్‌రేట్‌తో 104 పరుగులు జోడించినా గెలుపు మాత్రం దక్కలేదు. 
 
ఈ మ్యాచ్ గనక గెలిచి ఉంటే ఇది పూర్తిగా కేదార్ జాదవ్ విజయం అయ్యేది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ చివరివరకూ నిలిచి అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో కేదార్ జాదవ్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. దీంతో 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తర్వాత రెండు బంతులకు జాదవ్ పరుగులు తీయలేకపోయాడు. దీంతో 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో బ్యాట్ మార్చిన జాదవ్ ఐదో బంతికి సిక్సర్ బాదడానికి ప్రయత్నించాడు జాదవ్. కానీ దాన్ని బండరీ లైన్ వద్ద బిల్లింగ్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత జట్టు 9 వికెట్ కోల్పోయింది. దీంతో ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి. భువనేశ్వర్ బంతిని ఆడలేకపోయాడు. దీంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. ఈ వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 1-2 తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది.
 
భారత్‌ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. అప్పటికే అలవోకగా బౌండరీలు బాది జట్టును విజయానికి చేరువ చేసిన కేదార్‌ జాదవ్‌ క్రీజ్‌లో ఉండగా, తన అంతకుముందు ఓవర్లో 16 పరుగులు ఇచ్చిన వోక్స్‌ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతులను జాదవ్‌ అవలీలగా 6, 4 బాదేయడంతో రెండు బంతులకే 10 పరుగులు వచ్చాయి. విజయం ఖాయమనిపించిన ఈ దశలోనూ అదృష్టం భారత్‌కు ముఖం చాటేసింది. తర్వాతి రెండు బంతులకు పరుగు తీయలేకపోయిన జాదవ్‌ ఐదో బంతికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆఖరి బంతిని భువనేశ్వర్‌ ఆడలేకపోవడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల సంబరాలు, అటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో టీమిండియా సభ్యుల్లో నిరాశ... అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో  దోబూచులాడి చివరకు మోర్గాన్‌ సేన పక్షం వహించింది.  సుదీర్ఘ పర్యటనలో ఐదు టెస్టులు, రెండు వన్డేల పాటు గెలుపు రుచి చూడని ఇంగ్లండ్‌ ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసుకుంది.  
 
గత రెండు వన్డేలలాగే భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు  ఒత్తిడిని అధిగమించగలిగిన ఇంగ్లండ్‌ మొత్తానికి గెలుపును రుచిచూసింది. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో చేదు అనుభవాన్ని రుచి చూసిన స్టోక్స్, ఈసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం. ఓవరాల్‌గా 232 పరుగులు చేసిన జాదవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2–1తో గెలుచుకుంది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఈ నెల 26న ప్రారంభమవుతుంది.
 
 

వెబ్దునియా పై చదవండి