ధోనీని క్షమించాను. దేవుడికి తాను క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటున్న ఆ పెద్దాయన..
శనివారం, 21 జనవరి 2017 (07:34 IST)
వన్డే క్రికెట్ గేమ్ అర్థాన్ని మార్చి చూపిన యువరాజ్, ధోనీలను దేశమంతా ప్రశంసిస్తుండగా తాను మాత్రం ధోనీని క్షమించేశాను అంటున్నారు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్. కానీ ధోనీ మాత్రం తన తప్పును గుర్తించి ఆ దేవుడికి తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారీయన. తన కుమారుడు యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్‌నే ఫణంగా పెట్టేశాడంటూ గత మూడేళ్లుగా ధోనీని తిట్టిన తిట్టకుండా చెండాడుతున్న యోగరాజ్ సింగ్ ఎట్టకేలకు శాంతించారు.
దానికి బలమైన కారణం ఉంది. ధోనీతో కలిసి అద్భుతమైన శతకం బాదిన యువరాజ్ నమ్మశక్యం కాని దూకుడుతూ భారత్‌ను గెలిపించాక, తన కుమారుడి వీర విజృంభణకు ధోనీ కూడా తోడై నిలిచాడన్న ఒకే కారణంతో యోగరాజ్ సింగ్ ఎట్టకేలకు ధోనీని క్షమించేశారు.
కపిల్ దేవ్ హయాంలో బౌలర్‌గా వెలిగిన యోగరాజ్ 2011 వరల్డ్ కప్ సాధించిపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీని దీర్ఘకాలంగా ద్వేషిస్తూ వస్తున్నాడు. యువరాజ్‌ను భారత క్రికెట్ టీమ్ నుంచి తొలగించడానికి ధోనీయే కారకుడని బలంగా నమ్మిన యోగరాజ్ ఆనాటి నుంచి అవకాశం వచ్చినా రాకున్నా కల్పించుకునీ ధోనీని వీరతిట్టుడు తిడుతూ వినోదం కలిగిస్తూ వచ్చారు.
కానీ కటక్ వన్డేలో తన కుమారుడు యువరాజ్ దుమ్ము రేపిన క్షణాల్లో అతడికి దన్నుగా నిలిచి చివరికంటా నిలిచిన ధోనీపట్ల ఆ తండ్రిమనసు కాస్త చల్లబడింది. దేవుడు ధోనీని ఆశీర్వదించు గాక, ఈ రోజు అతడు శతకం సాధించాలనే అనుకున్నాను అంటూ యోగరాజ్ మీడియా ముందు తన ఆనందం పంచుకున్నాడు. అవును. నేనిప్పుడు ధోనీని క్షమించాను. దేవుడు అతడేం చేశాడన్నది గుర్తుపెట్టుకుంటాడు. నా కుమారుడు యుపీ పట్ల అతడు చేసిన దుర్మార్గానికిగాను దేవుడు ధోనిని క్షమించాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.
ధోనీ నా కుమారుడి క్రికెట్ కెరీర్‌ను మూడేళ్లపాటు భంగపర్చాడు. అలా అతను చేసి ఉండకూడదు. తాను తన తప్పును గుర్తించి దేవుడికి క్షమాపణలు చెప్పాల్సిందే. నాకూ నా పిల్లలకూ కీడు తలపెట్టిన వారిని నేను ఎల్లప్పుడూ క్షమిస్తూనే ఉంటాను. దేవుడు చాలా గొప్పవాడు అన్నారు యోగరాజ్ సింగ్. తన కుమారుడు నిజంగా చాలా కష్టపడతాడని, అతడి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తున్నందుకు దేవుడిని నేను ప్రార్థిస్తాను. నా కోడలికి అభినందనలు తెలుపుతున్నాను. బేటా అన్నివేళలా అతడికి తోడుగా ఉండు. పరస్పరం ప్రేమించుకోండి. ఒకరి నొకరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు యోగరాజ్ సింగ్.