ఆండ్రూ స్ట్రాస్ సెంచరీ: ఇంగ్లాండ్ 184/3

గురువారం, 11 డిశెంబరు 2008 (15:18 IST)
చెన్నై టెస్టులో ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో కదంతొక్కి ఇంగ్లాండ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్ట్రాస్ (104), కాలింగ్‌వుడ్ (4) లు ఉన్నారు. స్ట్రాస్ 14 ఫోర్లతో సెంచరీ చేశాడు. భారత్‌పై ఇది రెండోది కాగా, కెరీర్‌లో 13వది. ఓపెనర్లు స్ట్రాస్-కుక్‌లు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. కుక్ 5 ఫోర్లతో 52 పరుగులుచేసి హర్భజన్ బౌలింగ్‌లో జహీర్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ ఒక ఫోరుతో 17 పరుగులుచేసి జహీర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. స్ట్రాస్-బెల్‌లు రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. కెప్టెన్ పీటర్సన్ 4 పరుగులకే చేసి జహీర్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు పట్టుదలతో ఆడుతుండటం విశేషం.

చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. చెన్నై పిచ్ స్వభావాన్ని అంచనా వేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ జట్టులోకి గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసార్‌లను స్పిన్నర్లుగా తీసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి