ఆసీస్‌కు ఫాలో-ఆన్ తప్పించిన భారత్

ఆదివారం, 19 అక్టోబరు 2008 (15:42 IST)
మొహాలీలో భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్‌లో 268 పరుగులకే కుప్పగూలిన ఆసీస్‌ ఫాలో ఆన్‌లో పడినప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తానే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. మూడో రోజు ఆటలో టీ విరామానంతరం 268 పరుగులకు ఆసీస్ జట్టు ఆలౌట్ కావడంతో ఫాలోఆన్ తప్పలేదు కాని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఎంచుకుంది.

వాట్సన్ 78, బ్రెట్‌లీ 35 పరుగులతో చివర్లో ఆదుకున్నప్పటికీ చివరి వికెట్లు టపటపా రాలిపోవడంతో ఆసీస్ జట్టు మూడేళ్ల తర్వాత ఫాలోఆన్ చవిచూసింది. అయితే ఇప్పటికే 200 పరుగుల వరకు ఆధిక్యతలో ఉన్న భారత్ ముందస్తు వ్యూహంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంది.

ఆసీస్ జట్టులో కాటిచ్ 33, హస్సీ 54, క్లార్క్ 23, వాట్సన్ 78, బ్రెట్‌లీ 35 పరుగులు చేయగా 17 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా బారత్ జట్టులో అమిత్ మిశ్రా 71 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా ఇషాంత్ 2, భజ్జీ 2, జహీర్ ఖాన్ 1 వికెట్లు పడగొట్టారు.

ఆసీస్‌కు ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 7, సెహ్వాగ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి