కటక్ వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రారంభంలో షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓపెనింగ్ జోడీగా వచ్చిన రవి బొపారా, కుక్‌లు ధాటిగా ఆడుతూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు.
దీంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఈ దశలో విజృంభించిన జహీర్‌ఖాన్ రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జోరుకు కళ్లెం వేశాడు. దీంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 82 పరుగుల వద్ద కొనసాగుతోంది. పీటర్సన్ (29), కాలింగ్‌వుడ్ (6)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ప్రారంభంలో ధాటిగా ఆడింది. అయితే ఇంగ్లాండ్ స్కోరు 33 పరుగుల వద్ద ఓపెనర్ కుక్‌ని జహీర్ తన బౌలింగ్‌లో బోల్తా కొట్టించాడు. జహీర్ బౌలింగ్‌లో సచిన్ పట్టిన క్యాచ్‌తో కుక్ (10) పెవిలియన్ బాట పట్టాడు.
అటుపైనా జోరు తగ్గని ఇంగ్లాండ్‌కు మరో ఓపెనర్ బొపారాను ఔట్ చేయడం ద్వారా జహీర్ మరోసారి షాకిచ్చాడు. జహీర్ బౌలింగ్‌లో యువరాజ్ పట్టిన క్యాచ్‌తో బొపారా (24) క్రీజు నుంచి నిష్క్రమించాడు. వీరిద్దరి నిష్క్రమణతో ప్రస్తుతం క్రీజులో ఉన్న పీటర్సన్, కాలింగ్‌వుడ్‌లు జోరు తగ్గించి వికెట్లు కాపాడుకునే పనిలో పడ్డారు.