కటక్‌లో జరుగుతున్న అయిదో వన్డేలో ఓపెనర్ల విజృంభణ దన్నుతో భారత్ విజయం వేపుగా సాగిపోతోంది. వీరబాదుడుతో అలరించిన సెహ్వాగ్ -91-, పటిష్టంగా నిలిచి సరిగ్గా అర్థ సెంచరీ సాధించిన సచిన్ ఓపెనింగ్ సెషన్‌ను అదరగొట్టిన నేపధ్యంలో భారత్ విజయానికి చేరువగా నిలిచింది. సీరీస్‌లో మొదటి సారిగా యువరాజ్ సింగ్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్లో ధోని -50-, రైనా -53 నాటౌట్-లతో జట్టును విజయం వేపు నడిపించారు.
ఓపెనర్ల దూకుడుతో బెంబేలెత్తిన ఇంగ్లండ్ వరుసగా సచిన్, సెహ్వాగ్, యువీలను పెవిలియన్‌కు సాగనంపటంతో భారత్ చిక్కుల్లో పడిందనిపించింది కాని కెప్టెన్ ధోనీ, సురేష్ రైనా సమయోచిత బ్యాటింగ్‌తో అర్థ సెంచరీలు చేసిన క్రమంలో విజయం భారత్ ముంగిట నిలిచింది.
42వ ఓవర్ ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. విజయానికి మూడుపరుగులు మాత్రమే అవసరం కావడంతో భారత్ విజయం లాంఛనప్రాయమే అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో హార్మిసన్, స్టువర్ట్ బ్రాడ్, రవి బొపారా తలొక వికెట్ పడగొట్టినప్పటికీ భారత్ విజయయాత్రకు అడ్డుకట్టలు వేయలేకపోయారు.