పరువు కోసం ఓవల్ టెస్ట్‌ ఆడనున్న టీమ్ ఇండియా

ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఓవల్ మైదానంలో చివరి టెస్ట్ ఆడనుంది. ఈ సిరీస్‌లో జరిగే చివరిదైన నాలుగో టెస్ట్‌‌లో కూడా అవమానకరంగా ఓడి వైట్‌వాష్ కాకుండా ఉండాలని బరిలోకి దిగనుంది. టెస్ట్‌ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు తొలి మూడు టెస్ట్‌ల్లో భారీ తేడాతో ఓడి నెంబర్ వన్ స్థానాన్ని ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది.

సిరీస్‌లో చెత్తగా ఆడి విమర్శల జడివానలో తడిసిముద్దవుతున్న భారత జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంటే టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోతుంది. అయితే భారత కెప్టెన్‌ హోదాలో తొలిసారి సిరీస్‌ను కోల్పోయిన మహేంద్ర సింగ్ ధోని ఓవల్ టెస్ట్‌లో గెలిచి వైట్‌వాష్‌ను అడ్డుకోవడంతో పాటు ఐదు వన్డేల సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావిస్తున్నాడు.

79 ఏళ్ల తన టెస్ట్ క్రికెట్‌లో భారత్ మూడుసార్లు మాత్రమే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఓడిన చరిత్ర ఉంది. 1959లో ఇంగ్లాండ్‌ చేతిలో 5-0 తేడాతో, 1961-62లో వెస్టిండీస్‌పై 5-0 తేడాతో, 197-68లో ఆస్ట్రేలియా మీద 4-0 తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత భారత్ 3-0 తేడాతో మూడుసార్లు ఓడింది. 1967, 1974లలో ఇంగ్లాండ్‌పై 3-0 తేడాతో ఓడితే 1999-2000లో ఆస్ట్రేలియా చేతిలో ఒకసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

పర్యాటక జట్లకు మంచి రికార్డు వుండటంతో పాటు అత్యధిక స్కోర్లు నమోదయ్యే ఓవల్ మైదానంలో భారత జట్టు చివరి టెస్ట్ ఆడుతుండటం శుభవార్తే. అయితే సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్‌‌ల్లో మాదిరిగానే ఆతిథ్య ఇంగ్లీష్ ఆటగాళ్లు విజృంభిస్తే మాత్రం భారత్ నాలుగో టెస్టులో కూడా ఓడిపోయి 4-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం ఖాయంగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి